123 Swachh politics

Non-Governmental Organization (NGO)

స్వచ్చ్ పాలిటిక్స్ తోనే స్వచ్చ్ భారత్ సాధ్యం..
స్వచ్చమైన రాజకీయాలకోసం పోరాడదాం..


రాక్షసంగా జ‌నానికి కీడు చేసే యంత్రాంగం రాజ‌కీయం. ఇది ఒక సినిమాలో డైలాగు. కానీ ప్ర‌జ‌ల్లో నూటికి తొబ్బై తొమ్మిది శాతం మంది ఇదే నిర్వ‌చ‌నాన్ని రాజ‌కీయానికి ఆపాదిస్తున్నారు. నిజంగానే రాజ‌కీయం అంత నీచ‌మైన‌దా... నికృష్ట‌మైన‌దా...చెడు మార్గాన పయనిస్తున్న వారిని నువ్వు దొంగ‌త‌నం చేస్తున్నావురా... వ్య‌భిచారం చేస్తున్నావురా... జూద‌మాడుతున్నావురా... అన్యాయం చేస్తున్నావురా... అని తిట్టినట్లే రాజ‌కీయం చేస్తున్నావురా అని నిందిస్తున్నారు... అంటే రాజ‌కీయం ఒకనిందగా మారింది. రాజ‌కీయ‌మంటే పనికిమాలిన పని ఒక చెడు భావ‌న వ్యాపించింది. న‌ర‌న‌రాన రాజ‌కీయ‌మంటే ఏర్ప‌డిన ఈ ఏహ్య భావ‌న‌ను మ‌నం తొల‌గించుకోవాలంటే రాజ‌కీయాలు బాగు ప‌డాలి. స్వ‌చ్ఛంగా మారాలి. ఎందుకంటే ఆ రాజ‌కీయ నాయ‌కులే మ‌న గ్రామాల‌ను, ప‌ట్ట‌ణాల్ని, న‌గ‌రాల్ని , రాష్ర్టాన్ని, దేశాన్ని ఏలుతున్నార‌న్న‌ది కార‌ణం లేని వాస్త‌వ‌మే క‌దా... ఆ రాజ‌కీయ నాయ‌కుల్నే మ‌నం ఓట్లు వేసి గ‌ద్దెనెక్కించ‌డంతో పాటు మ‌న నెత్తి మీద‌కు కూడా ఎక్కించుకుంటున్నామ‌న్న‌ది అంగీక‌రించాల్సిన స‌త్య‌మే క‌దా. రాజ‌కీయాన్ని కంపు అంటున్నాం... రొచ్చు అంటున్నాం... మ‌రి ఆ రాజ‌కీయాన్నే శ్వాస‌గా... ఆశ‌గా... జీవితంగా మ‌లుచుకున్న నాయ‌కుల్ని మ‌నం పాల‌కులుగా ఎందుకు అంగీక‌రిస్తున్నాం? రాజ‌కీయ‌మ‌నే బుర‌ద‌గుంట‌లో ప‌డి దొర్లి మ‌న‌సుల్ని మ‌కిలం చేసుకుని అవినీతి, అక్ర‌మాల దుర్వాస‌న‌లు వెద‌జ‌ల్లుతున్న ఆ రాజ‌కీయ నాయ‌కుల‌కే మ‌నం స‌లాములు చేసి వారినినాయ‌కులుగా ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఆ రాజ‌కీయ నాయ‌కుల చేతుల్లో అధికారాలు క‌ట్ట‌బెట్టి వారు ఆడ‌మ‌న్న‌ట్ట‌ల్లా ఎందుకు ఆడుతున్నాం? ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని ద‌ర్జాగా అనుభ‌విస్తూ, స్వాహా చేస్తూ వోట్లకోసం రాజ‌కీయ నాయకులు మనపైకి విసిరే ఎంగిలి మెతుకుల కోసం, వారు చూపే ద‌యాదాక్షిణ్యాల కోసం ఎందుకు ఆశ‌గా ఎదురుచూస్తున్నాం? అందుకే మ‌న‌లో మార్పు రావాలి... మార్పు కావాలి... రాజ‌కీయం ఒక బుర‌దా.. అయితే ఆ బురదని క‌డిగేద్దాం.... రండి... రాజ‌కీయాల‌కు ప‌ట్టిన కుళ్లును వ‌ద‌లిద్దాం రండి.... స్వ‌చ్ఛ‌ భార‌త్ నినాదంతో మ‌న‌లోని సామాజిక భాద్య‌త‌ను గుర్తించి, స్పందించి ఎక్క‌డిక‌క్క‌డ పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఊడ్చేస్తున్న యువ‌తీ యువ‌కులకు,ఉద్యోగుల‌కు, వ్యాపారుల‌కు, విద్యార్థుల‌కు , మేధావుల‌కు , రైత‌న్న‌ల‌కు, కార్మిక క‌ర్ష‌కుల‌కు ఇదే మా విన్న‌పం. ఇదే మా ఆహ్వానం... రండి... క‌ద‌లిరండి... చైత‌న్య‌వంతులై రాజ‌కీయాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఊడ్చేయండి... స్వ‌చ్ఛ భార‌త్ క‌న్నా ముందు మ‌న‌కు స్వ‌చ్ఛ పాలిటిక్స్ అవ‌స‌రం. న‌వ భావ‌న‌ల‌తో, ఉప్పొంగిన చైత‌న్యంతో ఈ రాజ‌కీయానికి ప‌ట్టిన మాలిన్యాన్ని క‌డిగేయండి... రాజ‌కీయాన్ని రొచ్చుగా భావిస్తూ దానికి దూరంగా ఉండ‌కుండా ఆ రొచ్చును క‌డిగి ప‌న్నీటి స‌ర‌స్సుగా మార్చి రాజ‌కీయ‌మంటే రాగ‌ద్వేషాల‌కు అతీతంగా జ‌నానికి మేలు త‌ప్ప కీడు చేయ‌ని యంత్రాంగం అని కొత్త నిర్వ‌చనం ఇవ్వండి. పెద్ద‌య్యాక నేను డాక్ట‌ర్‌న‌వుతా.. ఇంజ‌నీర్‌న‌వుతా... పోలీసు ఆఫీస‌ర్ అవుతా... అన‌డ‌మే కాదు నేను పెద్ద‌య్యాక రాజ‌కీయ నాయ‌కుడిన‌వుతా... ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి సేవ చేస్తా అని స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని భావి భార‌త‌పౌరులు చెప్పుకునే విధంగా ఈ రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేద్దాం. రాజ‌కీయ నాయ‌కులంద‌రూ దొంగ‌లు కాదు.... దుర్మార్గులు కారు... ఏ వ్య‌వ‌స్థ‌లోనైనా మంచి చెడు అనేవి స‌హ‌జీవ‌నం చేస్తుంటాయి. మ‌న నాయ‌కుల్లో కూడా మంచివారు ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌నే త‌ప‌న ఉన్న నేత‌లు కూడా ఉన్నారు. అని రాజ‌కీయాల‌కు అణువ‌ణువునా ప‌ట్టిన మాలిన్యం వారికి కూడా బుర‌ద‌నంటిస్తుంది. నిష్క‌ల్మ‌షంగా సేవ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించ‌లేక‌పోతుంది. నిస్వార్థంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఆలోచ‌న ఉన్న న‌వ‌త‌రానికి.. యువ త‌రానికి రాజ‌కీయంలో అడుగు పెట్టే అవ‌కాశం కూడా లేక‌పోతుంది. అందుకే అంటున్నాం... రాజ‌కీయాల్ని శుభ్రం చేద్దాం... స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాల‌కు అండ‌గా ఉందాం... వారికి జేజేలు ప‌లుకుదాం... పెడ‌దారిప‌ట్టిన నాయ‌కుల‌ను స‌రైన దారిలో న‌డిపిద్దాం. బూజు ప‌ట్టిన భావాల‌తో అవినీతి, అన్యాయం శ్వాస‌గా జీవిస్తున్న కుహ‌నా నాయ‌కుల‌ను రాజ‌కీయాల నుంచి సాగ‌నంపుదాం. కొత్త ఆలోచ‌న‌ల‌కు మంచి భావ‌న‌ల‌కు స్వాగ‌తం ప‌లుకుదాం.... 1.2.3 అంటూ ఈ కొత్త లోకం కోసం ప‌రుగు ప్రారంభిద్దాం... అదే మా 1.2.3 స్వ‌చ్ఛ పాలిటిక్స్ వుద్యమ ల‌క్ష్యం.అదే మా గ‌మ్యం. ..అదే మా ప‌థం. 1.2.3 స్వ‌చ్ఛ పాలిటిక్స్ అంటే రాజ‌కీయ పార్టీ కాదు. ఏ కులానికో , మ‌తానికో, వ‌ర్గానికో సంబంధించిన సంఘ‌మూ కాదు... ఈ దేశ సౌభాగ్యం, సౌభ్రాతృత్వం కోరుకునే ప్ర‌తి పౌరుడికి వేదిక ఈ 1.2.3 స్వ‌చ్ఛ పాలిటిక్స్‌... ఈ స‌మాజం గ‌మ్యం ఎటువైపు అని మ‌ధన‌ప‌డుతూ స‌మాజ శ్రేయ‌స్సు కోసం ప‌రిత‌పించ‌డం త‌ప్ప యేం చేయాలో తెలియ‌క దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న సామాన్యుడి గొంతుక‌కు వేదిక ఈ 1.2.3 స్వ‌చ్ఛ పాలిటిక్స్‌... సామాన్యుల ఆశ‌లు తీరాల‌న్నా.... న‌వ‌త‌రం ల‌క్ష్యాలు సాధించాల‌న్నా... మ‌న దేశానికి బంగారు భ‌విష్య‌త్తు కావాల‌న్నా స్వ‌చ్ఛ‌మైన పాలిటిక్స్ ఆవ‌శ్య‌క‌త అవ‌స‌ర‌మ‌ని ఎలుగెత్తి చాట‌డ‌మే 1.2.3 స్వ‌చ్ఛ పాలిటిక్స్ ఉద్యమ ల‌క్ష్యం.... ఈ ఉద్య‌మం రోడ్లెక్కే ఉద్య‌మం కాదు... బ‌స్సుల్ని, రైళ్ల‌ను త‌గుల‌బెట్టే ఉద్య‌మం అంత‌క‌న్నా కాదు... ఏ రాజ‌కీయ పార్టీ ప్ర‌యోజ‌నం కోసం త‌ప‌న ప‌డే ఉద్య‌మం కానే కాదు... ఇది కేవ‌లం భావ వ్య‌క్తీక‌ర‌ణ ఉద్య‌మం. రాజ‌కీయ‌మంటే అలా కాదు... ఇలా ఉండాలి... అంటూ మ‌న ఆకాంక్ష‌ల‌ను నిర్మొహ‌మాటంగా సూటిగా గొంతు విప్పి చాటే ఉద్య‌మం... సామాన్యులు ఈ ఉద్య‌మానికి సార‌థుల‌యితే సామాజిక ప్ర‌సార సాధ‌నాలు... ప‌త్రిక‌లు... టీవీ ఛానెళ్లు ఈ ఉద్య‌మానికి ఊపిర్లు. కంపు కొట్టే రాజ‌కీయాన్ని ప్ర‌క్షాళ‌న చేద్దాం అనే ఈ స్వ‌చ్ఛ పాలిటిక్స్ నినాదం ఇంటింటా ప్ర‌తిధ్వ‌నించాలి. ఈ రాష్ట్రంలో , దేశంలో ప్ర‌తి చోట వినిపించాలి... ఆలోచింప‌చేయాలి... అప్పుడే సామాన్యుల ఆకాంక్ష‌లు... ఆశ‌యాలు... నెర‌వేర‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది. రండి... ప‌రుగున రండి... ప‌రిగెడుదాం రండి.... స్వ‌చ్ఛ పాలిటిక్స్ కోసం, మ‌న దేశ సౌభాగ్యం కోసం ఈ
ప్రజల్లో మార్పు రావాలి..నాయకుల్లో మార్పు రావాలి..ఆ మార్పు కోసమే ఈ ఉద్యమం..

2:37
ఎపికి ప్రత్యేకహోదా,విభజన హామీల సాధనకై గురజాలలో దీక్షలు ముగిసాయి.చివరి రోజు ఈ శిబిరం వద్ద 123స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు షేక్‌ బడేజాని మాట్లాడుతూ బీజెపీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.ప్రత్యేకహోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.నాలుగేళ్ళు మౌనంగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఇప్పటికికైన కేంద్రం ప్రత్యేక హోదా ,విభజనహమీలను అమలుపరచాని లేకపోతే 2019లో బిజెపి తగిన మూల్యం చెల్లించు కుంటుదన్నారు.ఈ దీక్షలలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్‌ హుస్సేన్‌,పూర్వపు సమితి మాజీ అధ్యక్షులు జమ్మిగుంపుల రామారావు ,జనసేన నాయకులు బడిదెల శ్రీనివాసరావు,వైకాపా నాయకులు వీరంరెడ్డి అమరారెడ్డిలు ప్రసంగించారు.చివరి రోజు దీక్షలో సీపీఐ నాయకులు,వైకాపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఈ దీక్షలను సీపీఎమ్‌ నాయకులు హైనా మస్తాన్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపచేసారు.ఈ దీక్షలను సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ సందర్శించారు.
4 months ago
2:15
పెట్రోల్‌ ,డీిజిల్‌ ధరలు సామాన్యప్రజలకు పెనుభారంగా మారాయని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం గురజాలలో వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.రిలే అనంతరం అఖిల పక్షంనాయకులు రోడ్డురోలర్‌కు తాడు సహాయంతో రహదారిలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 123 స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు షేక్‌ బడేజాని మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలను కేంద్రప్రభుత్వం అదుపు చేయలేకపోతుందన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలకు జిఎస్‌టిను అమలు చేయాలన్నారు.కేంద్రరాష్ట్రాల పన్నుశాతం తగ్గించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు షేక్‌ హుస్సేన్‌ ,జంపుల శ్రీనివాసరావు ,బండి నాగరాజు ,నాగులు మేస్త్రీ ,వైకాపా నాయకులు వి అమరారెడ్డి ,చలువాది నారాయణ ఎల్‌ చినవీరారెడ్డి ,కటకం అంకారావు ,కనకం శ్రీనివాసరావు ,తదితరులు పాల్గొన్నారు.
4 months ago
6:41
జిందాబాద్‌ సుప్రీింకోర్టు.... అంటూ 123 స్వఛ్ఛ్‌పాలిటిక్స్‌ ,వామపక్షాలు ఆధ్వర్యంలో గురజాలలో ర్యాలీ నిర్వహించారు.కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప రాజీనామ నేపధ్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.స్దానిక బస్‌స్టేషన్‌ వద్ద జరిగిన ప్రదర్శనలో 123స్వచ్ఛ్‌పాలిటిక్స్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు షేక్‌ బడేజాని మాట్లాడుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తగినంత మెజార్టీ లేకపోయిన దొడ్డి దారిన ముఖ్యమంత్రి అయిన యడ్డ్యూరప్ప రాజీనామ హర్షణీయం అన్నారు. ఇది ప్రజాసౌమ్య వాదులు,సుప్రీింకోర్టు విజయం అన్నారు.దేశ చరిత్రలో మూడురోజుల ముఖ్యమంత్రిగా యడ్డ్యూరప్ప నిలిచారన్నారు.అలానే ఏపి ,తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు,మంత్రులను ప్రజలు నిలదీయాలన్నారు. సీపీఐ జిల్లా నాయకులు షేక్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వౌమ్యం విజయం సాధించిదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్న బిజెపి నాటకానికి తెరపడిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జంపుల శ్రీనివాసరావు ,పట్టణ కార్యదర్శి షరీఫ్‌ , సహయ కార్యదర్శి బండి నాగరాజు,సీపీఎం నాయకులు హైనా మస్తాన్‌ ,వైసీపీ నాయకులు వి అమరారెడ్డి ,నాగులు మేస్త్రీ ,పెయింట్‌ శీను ,నేషనల్‌ నవకాంత్రి పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
4 months ago
9:51
రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజెపిని ఆహ్వనించిన గవర్నర్‌ వాజుబాయ్‌వాలను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురజాల పట్టణంలో 123స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌ ,మరియు వామపక్షాల ఆధ్వర్యంలో గవర్నర్‌ శవయాత్రను నిర్వహించారు.గవర్నర్‌ దిష్టి బొమ్మతో ర్యాలి నిర్వహించి డౌన్‌ డౌన్‌ గవర్నర్‌ , ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పల్నాడు టివీ అధినేత,123 స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు షేక్‌ బడేజాని మాట్లాడుతూ కర్ణాటకలో బీజెపీకి పూర్తి మెజార్టీ రాకపోయిన ముఖ్యమంత్రిగా యడ్యూరప్పచేత ప్రమాణ స్వీకారం చేయించి 15రోజుల్లో బలప్రదర్శనను నిరూపించుకోవాలని సమయం ఇచ్చి గవర్నర్‌ పార్టీ ఫిరాయింపులనుపరోక్షంగా ప్రోత్సహించారని విమర్శించారు.గతంలో గోవా ,మణిపూర్‌లలో సైతం ఇలాంటి రాజకీయాలను చేసి కేంద్రప్రభుత్వం అధికారమే పరమావధిగా అక్రమాలకుపాల్పడుతుందని ఆరోపించారు. రోడ్డుపై కర్ణాటక గవర్నర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా నాయకులుషేక్‌ హుస్సేన్‌ ,సీపీఐ పార్టీ మండల కార్యదర్శి జంపుల శ్రీనివాసరావు,పట్టణ కార్యదర్శి షరీఫ్‌,ఏఐటీయీసీ తాపీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు షేక్‌ నాగులు మేస్త్రీ,సీపీఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి బండి నాగరాజు,సీపీఎమ్‌ పార్టీ నాయకులు హైనామస్తాన్‌,123 స్వచ్ఛ్‌ పాలిటిక్స్‌ సభ్యులు షేక్‌ బడే సుభాని,మహేంద్రజాని,జగడాల శ్రీనివాసరావు,షేక్‌ అల్లాబక్ష్‌ , దుర్గ తదితరులు పాల్గొన్నారు.అనంతరం గురజాల రెవిన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంవద్దకు చేరుకుని కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు.
4 months ago